హాథ్రస్‌ ఘటనలో తీర్పు రిజర్వ్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ ఘటనపై గురువారం సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బొబ్డే ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ సందర్భంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపిస్తూ.. హాథ్రస్ బాధిత కుటుంబానికి యూపీ ప్రభుత్వం తగిన భద్రత కల్పించిందని కోర్టుకు తెలిపారు. న్యాయ సహాయ విషయంలో ఇప్పటికే ప్రైవేటు న్యాయవాదులు బాధిత కుటుంబం తరపున ఉన్నారని వివరించారు. మరోవైపు కేసు విచారణను దిల్లీకి బదిలీ చేయాలని బాధిత కుటుంబం తరపు న్యాయవాది సీమా కుష్వాహ కోర్టును కోరారు. స్టేటస్ రిపోర్ట్‌ను సీబీఐ యూపీ ప్రభుత్వానికి కాకుండా సుప్రీంకోర్టు సమర్పించాలని విజ్ఞప్తి చేశారు. స్టేటస్ రిపోర్టు నేరుగా కోర్టుకు సమర్పించడంలో అభ్యంతరం లేదని యూపీ ప్రభుత్వం తెలిపింది. అనంతరం చీఫ్‌ జస్టిస్‌ మాట్లాడుతూ.. ఈ కేసు మొత్తం విచారణను అలహాబాద్‌ హైకోర్టును చేయనివ్వాలని సూచించారు. అంతిమంగా కేసు విచారణపై తమ పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. మరోవైపు బాధిత కుటుంబానికి కేంద్ర బలగాలతో రక్షణ కల్పించాలని న్యాయవాది జైసింగ్‌ సుప్రీంను కోరారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది