రిపబ్లిక్‌ టీవీ, టైమ్స్‌ నౌపై చర్యలు తీసుకోండి

 


  • ఢిల్లీ హైకోర్టుకెక్కిన బాలీవుడ్‌ ప్రముఖులు
  • కరణ్‌ జోహర్‌, ఖాన్‌ త్రయం సహా 38మంది

న్యూఢిల్లీ, అక్టోబరు 12: బాలీవుడ్‌ నీచమని, డ్రగ్స్‌ బానిసలతో నిండిపోయిందని వ్యాఖ్యానించిన రిపబ్లిక్‌ టీవీ, టైమ్స్‌ నౌ చానెళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాలీవుడ్‌ ప్రముఖులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. వ్యాజ్యం వేసిన వారిలో కరణ్‌ జోహర్‌, యశ్‌ రాజ్‌, అనిల్‌ కపూర్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, అమీర్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌కు చెందిన వాటితో సహా 38 నిర్మాణ సంస్థలున్నాయి. రిపబ్లిక్‌ టీవీకి చెందిన అర్ణబ్‌ గోస్వామి, ప్రదీప్‌ భండారి, టైమ్స్‌ నౌకు చెందిన రాహుల్‌ శివ్‌ శంకర్‌, నవికా కుమార్‌లు బాలీవుడ్‌పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.



‘‘బాలీవుడ్‌ ఎన్నో ఏళ్లుగా సినిమాల రూపంలో, పర్యాటకం రూపంలో భారత్‌లో భారీ ఆదాయానికి వనరుగా ఉంటోంది. దేశంలోని మరే పరిశ్రమతో పోల్చినా.. ఇది విభిన్నమైనది. పూర్తిగా ప్రేక్షకుల ఆదరణ మీదే ఈ పరిశ్రమ నడుస్తుంది. గత కొంతకాలంగా టీవీ చానెళ్లు, సోషల్‌ మీడియాలో నడుస్తున్న దుష్ప్రచారాలు బాలీవుడ్‌ను తీవ్రంగా ప్రభావితం చేశాయి. పరిశ్రమకు చెందిన వారి వ్యక్తిగత జీవితాన్ని కూడా ఆక్రమిస్తున్నారు. వారి ప్రతిష్ఠను దిగజారుస్తున్నారు. మొత్తం పరిశ్రమనే నేరస్థులు, డ్రగ్స్‌ బానిసలుగా చూపే ప్రయత్నం జరుగుతోంది’’ అని ఆ వ్యాజ్యంలో పేర్కొన్నారు. చానెళ్లతో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ బాలీవుడ్‌ను అప్రతిష్ఠపాలు చేసే విధంగా వస్తున్న నిరాధార, అసభ్య వ్యాఖ్యలను అడ్డుకోవాలని ఆ వ్యాజ్యంలో కోరారు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తుల వ్యక్తిగత జీవితాలను రచ్చ చేస్తూ, ప్రముఖులపై మీడియాయే విచారణ నిర్వహించడాన్ని నిరోధించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కొత్తది పాతది